ఓ ఆడపిల్ల తండ్రి.. కన్యాదానం చేయడమన్నది అనాదిగా ఉన్న వ్యవహారమే. అయితే.. తన భార్య ప్రేమించిన వ్యక్తికే ఆమెని కన్యాదానం చేసిన భర్తని మాత్రం కనివిని ఎరుగం. అలాంటి ఓ భర్త కథే.. 'కన్యాదానం' చిత్రం. వినూత్న కథాంశాలకు చిరునామాగా నిలిచిన ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమాలో భర్తగా శ్రీకాంత్, భార్యగా రచన నటించగా.. ప్రియుడు పాత్రలో ఉపేంద్ర (తెలుగులో తనకిదే తొలి చిత్రం) అలరించాడు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, కవిత, శివాజీ, రాజీవ్ కనకాల, గోకిన రామారావు, వినోద్ బాల, మాధవిశ్రీ (వర్ష) ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
కోటి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్ సాహిత్యమందించారు. "కళ్యాణం ఇది కనివిని ఎరుగని", "సింగపూర్ సింగారాలే", "అయ్యయ్యో అయ్యయ్యో", "భలేగుంది భలేగుంది", "కనులే వెతికే", "ఇది ప్రేమ చరిత్రకి", "ఎక్కడుంది న్యాయం", "గౌలిగూడ లాలాగూడ".. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. అంబికా కృష్ణ నిర్మించిన 'కన్యాదానం'.. 1998 జూలై 10న విడుదలై జనాల్ని రంజింపజేసింది. నేటితో ఈ హిట్ మూవీ పాతికేళ్ళు పూర్తిచేసుకుంది.